హైదరాబాద్ : బ్రెంట్ చమురు ధరలు తగ్గడంతో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 4 పైసలు పెరిగి 95.40కి చేరింది. బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గడం , విదేశీ మారకపు నిధుల ప్రవాహం కొనసాగుతుందన్న అంచనాలు రూపాయికి మద్దతునిచ్చాయి. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి తన ప్రారంభ నష్టాలను పూడ్చుకుని, అమెరికన్ కరెన్సీతో పోలిస్తే 4 పైసల లాభంతో 95.40 వద్ద ట్రేడవుతోంది. ఇరాన్ , ఒమన్ మధ్య జలసంధి గుండా తాత్కాలిక షిప్పింగ్ కారిడార్ ఏర్పాటుపై చర్చలు కొనసాగుతుండటంతో, అనేక సెషన్ల తర్వాత బ్రెంట్ ధరలు మొదటిసారిగా 90 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోయాయి. ఎటువంటి తుది ఒప్పందం కుదరనప్పటికీ, చర్చలు కొనసాగుతుండటం వల్ల ప్రపంచ చమురు సరఫరాకు దీర్ఘకాలిక అంతరాయం కలుగుతుందన్న భయాలు తగ్గాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇంటర్-బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి 95.50 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత డాలర్‌తో పోలిస్తే 95.52కి పడిపోయింది .
దేశీయ కరెన్సీ నష్టాలను పూడ్చుకుని, అమెరికన్ కరెన్సీతో పోలిస్తే 4 పైసల లాభంతో 95.40 వద్ద ట్రేడైంది. ఇక నిన్న రూపాయి 26 పైసలు బలపడి 95.44 వద్ద ముగిసింది. ఈద్-ఎ-మిలాద్ సందర్భంగా బుధవారం భారతీయ విదేశీ మారకపు మార్కెట్ మూసివేయబడింది. ప్రపంచ దృష్టి చమురు , డాలర్లపై ఉన్నప్పటికీ భారతదేశంలో కూడా అంతే ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంటోంది. రూపాయికి మద్దతుగా వరుసగా రెండు నెలల పాటు డాలర్లను విక్రయించిన తర్వాత ఆర్బీఐ జూన్‌లో నికర కొనుగోలుదారుగా మారింది . సుమారు 561 మిలియన్ డాలర్లను కొనుగోలు చేసింద సీఆర్ ఫారెక్స్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ పబారీ అన్నారు. ఎఫ్ సీ ఎన్ ఆర్ బీ డిపాజిట్లు, ఓవర్సీస్ ఫారిన్ కరెన్సీ బారోయింగ్స్ , ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కోసం ఆర్బీఐ తీసుకున్న ప్రత్యేక చర్యలు దీనికి ప్రధాన కారణం అని పేర్కొన్నారు. ఆగస్టు 21 నాటికి ఈ చర్యలన్నీ కలిసి దాదాపు 73 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య రాకను ఆకర్షించాయి.


















