న్యూఢిల్లీ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒలింపిక్ పతకాల సంఖ్యను పెంచేందుకు భారత్ తన భాగస్వామ్యాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒలింపిక్ క్రీడల్లో పరిమిత భాగస్వామ్యం ఒక చేదు నిజంగా మార కూడదన్నారు. ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యను పెంచుకోవడానికి , క్రీడలను దేశ నిర్మాణంలో అంతర్భాగంగా మార్చడానికి భారత్ మరిన్ని క్రీడా విభాగాల్లో పోటీ పడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గతంలో పాల్గొనని క్రీడా విభాగాల్లో కూడా భాగస్వామ్యాన్ని పెంచుకుంటేనే ఒలింపిక్స్‌లో భారత్ పనితీరు మెరుగుపడుతుందని గురువారం ఆయన పేర్కొన్నారు. ‘ఖేలో ఇండియా డైలాగ్’ కోసం వివిధ ప్రాంతాల్లో సమావేశమైన వందలాది మంది క్రీడాకారులు, విద్యార్థులు , స్వచ్ఛంద కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించారు మోదీ. క్రీడల పట్ల తన దార్శనికత కేవలం పతకాలు గెలవడం మాత్రమే కాదని, వాటిని దేశ నిర్మాణ ప్రక్రియలో అంతర్భాగం చేయడమేనని ప్రధాని చెప్పారు.
ఒలింపిక్స్‌లో అనేక రకాల క్రీడలు ఉన్నాయని, కానీ భారతీయ జట్లు వాటిలో సగం విభాగాల్లో కూడా పాల్గొనడం లేదని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 32 క్రీడా విభాగాలకు గాను భారత్ కేవలం 16 విభాగాల్లో మాత్రమే పాల్గొందని తెలిపారు. పతకాల కోసం జరిగే పోటీలో ఒక పెద్ద విభాగంలో మనం అసలు పోటీనే పడటం లేదని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలు ఆ క్రీడల్లో పతకాలు సాధిస్తుంటే, మనం కనీసం వాటిలో పాల్గొనక పోవడం దారుణమన్నారు. మన పతకాల సంఖ్యను పెంచుకోవాలంటే, మనం ఈ క్రీడల్లో కూడా నైపుణ్యం సాధించాలి అని ఆయన జోడించారు. ఒలింపిక్స్‌లో భారత్ భాగస్వామ్యాన్ని మెరుగు పరిచే లక్ష్యంతో 5 నుండి 15 ఏళ్ల వయస్సు గల పిల్లల కోసం దేశవ్యాప్త ప్రతిభా అన్వేషణ కార్యక్రమాన్ని చేపడతామని ఆగస్టు 15న జరిగిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ ప్రకటించారు.
