ముంబై : నిన్నటి దాకా తనను తిట్టిన వాళ్లు ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తను ఒంటి చేత్తో విండీస్ పై గెలిపించాడు. అదే ఊపును కొనసాగించాడు. ముంబై వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముందుగా భారత్ జట్టు మైదానంలోకి దిగింది. ఊహించని రీతిలో భారీ స్కోరు నమోదు చేసింది. ఓ వైపు అభిషేక్ శర్మ త్వరగా పెవిలియన్ బాట పట్టాడు. కానీ ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు సంజూ శాంసన్. తనతో పాటు ఇషాన్ కిషాన్ చెలరేగి ఆడారు. పవర్ ప్లేలో భారీ స్కోరు నమోదు చేశారు. ఇరువురు కలిసి ఉతికి ఆరేశారు ఇంగ్లండ్ బౌలర్లను. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
సంజూ శాంసన్ 42 బంతులు ఎదుర్కొని 89 పరుగులు చేశాడు. 8 ఫోర్లు 7 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ఇషాన్ కిషన్ 38 రన్స్ చేస్తే , పాండ్యా 26, తిలక్ వర్మ 27, శివమ్ దూబే 44 పరుగులతో ఆకట్టుకున్నారు. ఇండియా స్కోర్ లో కీ రోల్ పోషించారు. భారత బౌలర్లు బుమ్రా, పటేల్, పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్ లు తమ వంతు సహకారం అందించారు. ప్రత్యేకించి బుమ్రా చేసిన బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను గనుక తక్కువ పరుగులు ఇచ్చి ఉండక పోతే ఇండియా ఆశలు గల్లంతు అయ్యేవి. మరో వైపు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంది. ఆ జట్టు కూడా అద్బుతంగా ఆడింది. ఇండియాకు ముచ్చెమటలు పట్టించింది.
