అమరావతి : జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పు చేర్పులతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌పై వ్యక్తమైన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా… దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా… వాటిపై క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశం పైనా చర్చ జరిగింది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. విస్తీర్ణం పరంగా పెద్దదైన ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు, అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్‌లోనూ, అచ్యుతాపురంను అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్‌లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంప చోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు…ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టుగా యధావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు.
