అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన ఆర్టీసీ ఎండీ తిరుమల రావుకు కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందిన వైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశ పెట్టదలచిన 1,450 బస్సులు కూడా ఈవీనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ముందుగా ఏర్పాటు చేయాలనిస్పస్టం చేశారు సీఎం.
వీటికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని సూచించారు. ఏపీఎస్ ఆర్టీసీలో ప్రవేశపెట్టే ఈ బస్సుల రోడ్ మ్యాప్‌పై సచివాలయంలో నేడు సీఎం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఐదేళ్లలో 8,819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశ పెట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఇంకా 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్న బస్సులను ఈవీలుగా మార్పిడి చేయాలని సూచించారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా, సౌకర్యాలు మెరుగయ్యేలా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. స్త్రీ శక్తి – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తలెత్తిన రద్దీకి తగినట్టుగా నూతన బస్సులు ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ మరింత ఆదాయం పెంచుకునేలా చూడాలని , ఇందు కోసం చర్యలు తీసుకోవాలని ఎండీని ఆదేశించారు.


















