హైదరాబాద్ : మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం ఉంటున్న బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. గత కొంత కాలంగా తాను పార్టీ కి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఒక పార్టీ నాయకుడి పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.తన తాజా వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ చర్చకు తెరలేపారు. ఆయన భారతీయ రాష్ట్ర సమితి లోని ప్రముఖ నాయకులలో ఒకరు. నేను బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న క్షణమే ప్రజలు నన్ను మర్చిపోతారంటూ బాంబు పేల్చారు.
పార్టీలో ఆయన భవిష్యత్తుపై ఈ వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు దారితీశాయి. మల్లారెడ్డి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, పార్టీ కార్యాలయానికి దూరంగా ఉంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. అంతకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన పార్టీ మారవచ్చని ఊహాగానాలు వచ్చాయి. అయితే, మల్లారెడ్డి ఆ వార్తలను కొట్టిపారేశారు ,అవి నిరాధారమైనవని స్పష్టం చేశారు. ఆయన కోడలు ప్రీతి రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించడం, బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించడం తర్వాత కూడా ఇలాంటి ఊహాగానాలు తలెత్తాయి. మల్లారెడ్డి యూనివర్సిటీలో రాబోయే ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రిని ఆహ్వానించడానికే ఆ సందర్శన జరిగిందని, దాని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ఆమె తర్వాత స్పష్టం చేశారు.


















