తిరుపతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్తులకు బిగ్ షాక్ ఇచ్చారు. రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ, భక్తులకు పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు భద్రతా భావం కల్పించే బాధ్యత పోలీసులదేనని అన్నారు. తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని హోం మంత్రి వి.అనితతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడే ఉన్న విజిటర్స్ పుస్తకంలో తన అభిప్రాయాలను, సూచనలను రాశారు. అంతకు ముందు సీఎం పోలీసు దళం నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
టెక్నాలజీని వాడుకుని నేర నియంత్రణ చేయాలని అన్నారు. డ్రోన్ల ద్వారా పెట్రోలింగ్ నిర్వహించి విజువల్ ఆధారాలను సేకరించాలని సూచించారు నారా చంద్రబాబు నాయుడు. నేరస్తుల కంటే పోలీసులు ఎక్కువ ఆలోచించ గలగాలని.. వారెన్ని డ్రామాలు ఆడినా టెక్నాలజీ సాయంతో పట్టుకోవాలని స్పష్టం చేశారు. నేరస్తుల కంటే పోలీసులు తెలివిగా వ్యవహరించాలని సీఎం అన్నారు. ఈ విషయంలో విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానాన్ని అనుసరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. కలియుగ వైకుంఠమైన శ్రీవేంకటేశ్వర స్వామి నెలకున్న ఈ ప్రాంత పవిత్రతను కాపాడేలా పోలీసులు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసు వ్యవస్థ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎక్కడా చిన్న అసౌకర్యం కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
