గుంటూరు జిల్లా : మంగళగిరి ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు మంత్రి నారా లోకేష్. అన్నిరంగాల్లో మంగళగిరి నెం.1గా నిలబడాలన్నదే నా తపన. భారతదేశంలోనే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. మంగళవారం మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సికె కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటుచేసిన సభలో మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకమయ్యారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో నేను స్థానిక ప్రజలను అర్థం చేసుకునేలోపు ఎన్నికలు అయిపోయాయి, ఫలితంగా 5,300 ఓట్లతో ఓడిపోయాను. రెండురోజులు బాధ పడినా మీ మనసు గెలవాలని ఆనాటి నుంచి నా ప్రయాణం ప్రారంభించా. ఐదేళ్లలో ఎప్పుడు ఎవరిని కలిసినా మా భూమికి శాశ్వత హక్కు కావాలని అడుగుతూ వచ్చారు. ఒకేసారి అందరి భూములను రెగ్యులరైజ్ చేయలేను, అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని చెప్పాను.
ఈరోజు 3 వేల మందికి శాశ్వత పట్టాలు అందజేస్తున్నాం అన్నారు నారా లోకేష్. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఎవరు వచ్చి తమ ఇళ్లు, స్థలాలు లాగేసుకుంటారోనని భయంతో బతికారు, ఈరోజుతో ఆ భయం పోతుంది, భూమిపై శాశ్వత హక్కును కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. సుమారు వెయ్యికోట్ల విలువైన భూమిని ఈరోజు అందిస్తున్నాం. మీ భూమిని ఇకపై కుటుంబ అవసరాలకు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఎవరు వచ్చినా మీ భూమిని తీసుకోలేరని స్పష్టం చేశారు నారా లోకేష్. 2019 ఎన్నికల తర్వాత అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. కొడుకును గెలిపించు కోలేక పోయావని కొందరు మా నాన్నను అవమానించారు. ఎన్నికలకు ముందు నేను గతంలో ఓటమిపాలైన 5300 పక్కన ఒక్క సున్నా పెట్టి గెలిపించమని చెప్పా. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో టాప్ -3 మెజారిటీ ఇచ్చారు. మీరిచ్చిన బలమే ఇప్పుడు నన్ను ముందుకు నడిపిస్తోందని అన్నారు.
















