ఢిల్లీ : ఎవరూ ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. దిగ్గజాలను కాదని బీహార్ రాష్ట్రంలో మంత్రిగా పని చేస్తున్న నితిన్ నబిన్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది పార్టీ శ్రేణులను, నాయకులను, కార్యకర్తలను విస్మయానికి గురి చేసింది. ఈ సందర్భంగా నితిన్ నబిన్ మీడియాతో మాట్లాడారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా పని చేయడానికి నన్ను నమ్మి, అవకాశం ఇచ్చినందుకు బిజెపి అగ్ర నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుండి కూడా మేం నిరంతరం నేర్చుకుంటున్నామని అన్నారు. తను నన్ను ఒక సంరక్షకుడిలా నడిపించారు… పార్లమెంట్ బోర్డు సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని అన్నారు నితిన్ నబిన్.
బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ అనే విధానంతో బిజెపిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. ఇదిలా ఉండగా నితిన్ నబిన్ నియామకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తనపై ప్రశంసలు కురిపించారు. తను యువకుడు, పని పట్ల అంకిత భావం ఉందన్నారు. బీహార్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పర్యాయాలు అద్భుతమైన రికార్డు ఉందని అందుకే తను పార్టీ చీఫ్ అయితే బాగుంటుందని భావించామన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
















