బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి కొలువు తీరిన సిద్దరామయ్య ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ అందుబాటులో లేక పోవడంతో వారి ప్రత్యేక కార్యదర్శికి ముఖ్యమంత్రిగా తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిద్దరామయ్య. ఒక గ్రామంలో పుట్టి పెరిగిన నేను, ఒకనాడు ఈ రాష్ట్రానికి పాలకుడిగా, మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా , రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవుతానని కలలో కూడా ఊహించ లేదు. ఇంతటి మహత్తర స్వప్నం సాకారం కావడానికి కారణం బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే అని స్పష్టం చేశారు.
బుద్ధుడు, బసవేశ్వరుడు, బాబా సాహెబ్ , మహాత్మా గాంధీ నా ఆదర్శ నాయకులు. నా ముప్పై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో, రాష్ట్రంలోని అవకాశాలకు నోచుకోని, దోపిడీకి గురైన , పేద ప్రజల కోసం నిజాయితీగా పని చేసినందుకు నేను ఎంతో సంతృప్తిని పొందుతున్నానని పేర్కొన్నారు సిద్దరామయ్య. నన్ను శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకుని, ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ శాసనసభ్యులకు, నాతో భుజం భుజం కలిపి పనిచేసిన నా మంత్రివర్గ సహచరులకు; నాకు ఈ అవకాశాన్ని ప్రసాదించిన పార్టీ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ , AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు, అలాగే నా రాజకీయ జీవితమంతటినీ ప్రేమతో, ఆదరణతో నింపి, నన్ను ఇంత దూరం నడిపించడానికి చేయూతనిచ్చిన ఆప్యాయత నిండిన కన్నడిగులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.
రాజ్యాంగమే నా మతం, ప్రజలే నా దైవాలు. నా రాజీనామా కేవలం ముఖ్యమంత్రి పదవికి మాత్రమే పరిమితం, క్రియాశీల రాజకీయాలకు కాదన్నారు సిద్దరామయ్య. నా చివరి శ్వాస వరకు, నేను సామాజిక న్యాయం కోసం , రాజ్యాంగాన్ని వ్యతిరేకించే మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు.
