హైదరాబాద్ : సినిమాలను పైరసీ చేస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కస్టడీ ముగిసింది. పోలీసుల ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, తాను ఎక్కడికీ పారి పోలేదన్నాడు. తాడో పేడో కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పాడు. తాను ఇన్నాళ్లూ కూకట్ పల్లిలోనే ఉన్నానని అన్నాడు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ బక్వాస్ అంటూ కొట్టి పారేశాడు. బెట్టింగ్ యాప్స్‌తో సంబంధాలు ఉన్నాయని ఎవరు చెప్పారంటూ మండిపడ్డాడు ఐబొమ్మ రవి. పోలీసులు చెబితే నేరం చేసినట్టేనా అని ఫైర్ అయ్యాడు.
కేవలం వేరే దేశపు సిటిజన్‌షిప్ మాత్రమే తీసుకున్నానని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా తన విచారణలో కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. రవి సినిమా పైరసీ నెట్‌వర్క్‌ను నడపడానికి స్నేహితుల గుర్తింపులను ఉపయోగించాడని , అంతే కాకుండా రూ. 13 కోట్ల లావాదేవీలు కనుగొన్నట్లు టాక్. 12 రోజుల కస్టోడియల్ విచారణలో, పెద్ద ఎత్తున గుర్తింపు దుర్వినియోగం, మనీ లాండరింగ్‌ను సూచించే కీలక ఆధారాలను పరిశోధకులు కనుగొన్నారు. ఇక ఐబొమ్మ రవి పైరసీ కేసు దర్యాప్తు నాటకీయ మలుపు తిరిగింది, సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ గుర్తింపులు, నకిలీ పత్రాలు, ఐబొమ్మ రవితో ముడిపడి ఉన్న భారీ ఆర్థిక లావాదేవీల వలయాన్ని కనుగొన్నారు.
రవి తన సన్నిహితులు ముగ్గురు ఉన్నారని తెలిపారు పోలీసులు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్, కరీంనగర్ కు చెందిన అంజయ్య , అతని 10వ తరగతి బ్యాచ్ మేట్ కాళీ ప్రసాద్ ల వ్యక్తిగత పత్రాలను ఉపయోగించి అనేక నకిలీ గుర్తింపులను సృష్టించాడని పేర్కొన్నారు.


















