హైదరాబాద్ : తన ముందున్న లక్ష్యం ఒక్కటేనని అది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమేనని నొక్కి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఆయన చిట్ చాట్ సందర్బంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మరో 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉంటానని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఒంటరిగా పోరాటం చేయడం, ఆ తర్వాత అనుకున్నది సాధించడం తన వంట్లో ఉందన్నారు. ఇప్పటికే జెడ్పీటీసీ అయ్యాను. ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యేగా గెలుపొందాను. సీఎం కావాలని అనుకున్నా. ఆనాడే తొలిసారి ఇండిపెండెంట్ గా గెలిచినప్పుడే సంచలన ప్రకటన చేశానని, ఆచరణలో ఇవాళ మీ ముందు ముఖ్యమంత్రిగా కూర్చున్నానని, రేపు కూడా నేనే ఉంటానని ప్రకటించారు.
ఇక తనకు ఏనాడూ ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదన్నారు. తనకంటూ ఓ ప్లాన్ ఉంటుందని, ఆ మేరకు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు సాగుతానని అన్నారు. చాలా సింపుల్ గా ఉంటానని, ఇంకొకరి ముందు తాను వంగి సలాం చేయనని ప్రకటించారు. తనకు పోరాడటం అంటే చాలా ఇష్టమన్నారు రేవంత్ రెడ్డి. దేశంపై గాంధీ కుటుంబానికి విశ్వాసం ఉందన్నారు. పార్టీ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల వద్ద తనకు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు వచ్చిందని వెల్లడించారు. గతంలో తాను టీడీపీలో 10 ఏళ్ల పాటు పనిచేశానని.. అయితే పార్టీని వీడిన సమయంలో కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి.. తన పరిస్థితి గురించి అర్థమయ్యేలా వివరించినట్లు చెప్పారు. ఇప్పటికి తనను చంద్రబాబు గౌరవిస్తారని తెలిపారు.
