ఢిల్లీ : తనకు సీఐఐతో సుదీర్ఘమైన అనుబంధం ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీ లోని తాజ్ ప్యాలస్ లో జరిగిన సీఐఐ బిజినెస్ సమ్మిట్ కు హాజరై ప్రసంగించారు నారా చంద్రబాబు నాయుడు. గత కొన్నేళ్లుగా సీఐఐతో ప్రయాణం చేస్తున్నానని చెప్పారు. పెట్టుబడుల గురించి సీఐఐతో కలిసి పనిచేశానని అన్నారు . దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే నా అజెండా అని స్పష్టం చేశారు సీఎం. నాలెడ్జీ, టెక్నాలజీ, ట్రస్ట్, స్పీడ్ అనే అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా పోటీ ఉందన్నారు.పరిశ్రమల ఎకోసిస్టమ్, పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఐఐ చాలా కృషి చేసిందని ప్రశంసించారు నారా చంద్రబాబు నాయుడు. 1990లో వచ్చిన సంస్కరణలను అందిపుచ్చుకుని మనం అంతా కలిసి ముందుకు వెళ్లాం అన్నారు. క్వాంటం, ఏఐ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, ఇంటెలిజెంట్ లాజిస్టిక్స్ రంగాలను అంది పుచ్చుకునేలా మనం పని చేస్తున్నామని పేర్కొన్నారు సీఎం.
వేర్వేరు రంగాల్లో గ్లోబల్ ట్యాలెంట్ కూడా మనకు ఉందని చెప్పారు. దేశానికి సరైన చోట సరైన నాయకుడుగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని కితాబు ఇచ్చారు. ఆర్ధిక సంస్కరణలు దేశానికి చాలా అవకాశాలు కల్పించాయన్నారు. చాలా ఆవిష్కరణలకు కారణం అయ్యాయని తెలిపారు. టెలికామ్ డీరెగ్యులేషన్, ఓపెన్ స్కై పాలసీ, విద్యుత్ సంస్కరణలు, రహదారులు లాంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు ఈ సందర్బంగా సీఎం. ఈ సంస్కరణల్లో నేను కూడా భాగస్వామిని కావటం సంతోషంగా ఉందన్నారు . ప్రస్తుతం దేశంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.



















