న్యూఢిల్లీ : ప్రముఖ పాప్ పంజాబ్ సింగర్ దలేర్ మెహందీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్ కార్యక్రమ వివాదంపై స్పందించాడు. తనకు మద్దతునిచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల నేను ఎదుర్కొన్న అనుభవం నన్ను మాటల్లో వర్ణించలేనంతగా కదిలించింది అని గాయకుడు దలేర్ మెహందీ అన్నారు. ఆయన ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ సంఘటనను గుర్తు చేసుకున్నారు మరోసారి.
“తునక్ తునక్ తున్”, “బోలో తా రా”, “హో జాయేగీ బల్లే బల్లే” వంటి హిట్ పాటలతో ప్రసిద్ధి చెందిన మెహందీ అక్టోబర్ 18న ఉత్తరాఖండ్‌లోని న్యూ టెహ్రీలో జరిగిన చారిత్రాత్మక ‘సిద్ధపీఠ్ మా కుంజపురి పర్యాటక , అభివృద్ధి ఉత్సవం’లో ప్రదర్శన ఇస్తుండగా క్యాబినెట్ మంత్రి , నరేంద్ర నగర్ ఎమ్మెల్యే సుబోధ్ ఉనియాల్ గాయకుడి ప్రదర్శన పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆ మంత్రి వేదికపైకి వెళ్లి ప్రదర్శనను నిలిపివేసి, గాయకుడు మద్యం సేవించి ఉన్నాడని ఆరోపించారు. ఆ వీడియోలు ఇంటర్నెట్‌లో వెలుగులోకి రావడంతో, పలువురు అభిమానులు, సెలబ్రిటీలు మెహందీకి తమ మద్దతును తెలియజేస్తూ ఆ గాయకుడికి సంపూర్ణ సహకారం అందించారు. ఈ ఘటన చర్చకు దారితీసేలా చేసింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దలేర్ మెహందీకి సపోర్ట్ లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో తనకు అండగా ఉన్నందుకు ఆయన సర్వదా రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
