తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఈ సందర్బంగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిప్పులు చెరిగారు. అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికలు నీతికి, న్యాయానికి , ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం అని అన్నారు. తనను కేవలం నటుడిగానే పరిగణించడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాను సినిమాలలో మాత్రమే నటుడినని, కానీ రాజకీయాలలోకి వచ్చింది నటించేందుకు మాత్రం కాదని ప్రకటించారు. దమ్ముంటే తను లేవదీసిన అంశాలపై జవాబు ఇవ్వాలని ఆయన డీఎంకే పార్టీ చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్ కు సవాల్ విసిరారు.
తమిళనాడు ఎన్నికలకు ముందు చెన్నైలో జరిగిన తన చివరి ప్రసంగంలో, కేవలం ఒక నటుడిగానే తనను పరిమితం చేసి చూస్తున్న వారి గురించి విజయ్ మాట్లాడారు. ఇదే సందర్భంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన కరూర్ తొక్కిసలాట ఘటన గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన కొంత అసహనానికి గురైనట్లు కనిపించారు. ఆయన వ్యంగ్యంగా ఇలా అన్నారు: ఒక మంత్రి ఉన్నారు, ఆయన పదే పదే ‘విజయ్ ఒక నటుడు, విజయ్ ఒక నటుడు’ అని అంటూనే ఉంటారంటూ ఎద్దేవా చేశారు. అవును, నేను నటుడినే. ఆయన ఏదో కొత్త విషయాన్ని కనిపెట్టినట్లుగా మాట్లాడుతుంటారని మండిపడ్డారు. కానీ నేను రాజకీయాల్లో నటించలేదు. రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుండి నేను నటించడం మానేశాను. అసలు నాటకాల మీద నాటకాలు ఆడుతున్నది మీరే కదా? అలాంటప్పుడు మిమ్మల్నే నటులు, నటీమణులు అని పిలవాలేమా అని ప్రశ్నించారు టీవీకే విజయ్.
