చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా మంత్రిగా కొలువు తీరిన టీవీకే పార్టీ ప్రచార కార్యదర్శి, మంత్రి అధవ అర్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ మంత్రి , డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సనతాన ధర్మం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే స్టాలిన్ కు సనాతన ధర్మం అంటే ఏమిటో ఇంకా అర్థం కాలేదన్నారు. ఇదే సమయంలో తాము హిందువులకు వ్యతిరేకం కానే కాదని స్పష్టం చేశారు అధవ అర్జున. ఇవాళ ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడారు.
కానీ తాము పూర్తిగా హిందుత్వానికి వ్యతిరేకమని చెప్పారు . టీవీకే పార్టీ ముందు నుంచి ఒక్కటే చెబుతూ వస్తోందని అన్నారు. అది ఏమిటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ సమానులేనని. ఇక్కడ ఏ ఒక్కరు ఎక్కువా కాదు ఇంకొకరు తక్కువ కాదన్నారు. తాము, తమ పార్టీ కుల వ్యవస్థకు, మహిళల బానిసత్వానికి పూర్తిగా వ్యతిరేక అని అధవ అర్జున నొక్కి చెప్పారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులే కాదు మేము అందరినీ సమానంగా చూస్తాము. అదే భారత రాజ్యాంగ స్ఫూర్తి అన్నారు.
వ్యక్తిగతంగా తాను ఒక నాస్తికుడినని, అయితే తన రాజ్యాంగ పరమైన బాధ్యత దృష్ట్యా అన్ని మతాలను గౌరవించడం తనకు తప్పనిసరి అని కూడా పేర్కొన్నారు అధవ అర్జున. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాలతో మెజారిటీ సాధించింది. బల పరీక్షలో ఏకంగా 144 ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
