హైదరాబాద్ : వరద ముప్పులేని నగరం అందరి లక్ష్యం కావాలని, ఏప్రిల్ నాటికి డీ సిల్టింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. నగరంలో అసాధారణ వర్షాలు పడుతున్నాయని, ఒకే రోజు 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోందని అన్నారు.. ఇలాంటి తరుణంలో వరద నీరు సాఫీగా సాగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని స్పష్టం చేశారు ఏవీ రంగనాథ్ . జీహెచ్ ఎంసీ మెయింటినెన్స్ విభాగం ఆధ్వర్యంలో జనవరి నుంచి ప్రారంభం కానున్న డీసిల్టింగ్ పనుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ మెయింటినెన్స్ విభాగం, హైడ్రా అధికారులతో హైడ్రా కార్యాలయంలో జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్‌లో హైడ్రా కమిషనర్ పలు సూచనలు చేశారు.
ఈ ఏడాది వర్షాకాలం ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత వరద నియంత్రణలో విజయవంతం అయ్యామన్నారు. క్యాచ్ పిట్లు, కల్వర్టులలో సిల్ట్ ను తొలగించేదే హైడ్రా పని అయినప్పటికీ.. ప్రధాన నాలాల్లో పూడికను కూడా తొలగించామని చెప్పారు. ఈ వర్షాకాలంలో అనుభవంలోకి వచ్చిన సమస్యలు ఎన్నో పాఠాలు నేర్పాయని.. వచ్చే ఏడాది మరింత సమర్థవంతంగా పని చేయడానికి ఇవన్నీ ఊతమిస్తాయని అన్నారు. డీసిల్టింగ్ పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేసి. వరద నీరు సాఫీగా సాగడానికి హైడ్రా సహకారం అన్ని విభాగాలకు అందుతుందన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.















