హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కుల భరతం పడుతోంది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. ప్రతి సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో ప్రజా వాణి నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏకంగా రూ. 750 కోట్లకు ఎసరు పెట్టిన స్థలాన్నిగుర్తించారు. ఆ వెంటనే ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లారు. స్థలాన్ని పరిశీలించారు. కబ్జాకు గురైనట్లు తేలింది. ఈ సంఘటన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట విలేజ్ లో చోటు చేసుకుంది.
ఆక్రమణకు గురైన స్థలం సర్వే నంబరు 191లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ స్థలం కొంత కాలం నుంచీ ఆక్రమణకు గురైంది. మార్కెట్ లో భారీ ధర పలకడంతో దీనిపై కన్నేశారు. ఆపై కబ్జాకు పాల్పడ్డారు కబ్జారాయుళ్లు. ఈ భారీ విలువైన స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 750 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతుందని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతో కలిసి విచారించింది. ఆక్రమణలను నిర్ధారించుకుంది.హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు శాశ్వత నివాసాల జోలికి వెళ్లకుండా.. మిగతా షెడ్డులను, ప్రహరీలను తొలగించారు 10 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బోర్డు లు ఏర్పాటు చేసింది.
















