హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పుడు ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వానికి చెందిన స్థలాలు, పార్కులు, చెరువులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ప్రజావాణి చేపడుతున్నారు. తాజాగా శనివారం రోజు ప్రత్యేకంగా బాధితుల కోసం ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ జిల్లా ఆసిఫ్‌నగర్ మండలం గుడిమల్కాపూర్ గ్రామంలో ఏజీ ఆఫీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరిట 10 ఎకరాల్లో 83 ప్లాట్లతో దశాబ్దాల క్రితం లేఔట్ వేశారు. ఇందులో 79, 80, 81 నంబర్లతో ఉన్న ప్లాట్లు గుంతలో ఉన్నాయి. లే ఔట్‌ను రివైజ్ చేసి ఇక్కడ ప్లాట్లున్నవారికి వేరే చోట కేటాయించారు. గుంతలా ఉన్న 1500ల గజాల స్థలాన్ని పార్కుగా పేర్కొన్నారు.
ఆ గుంత పూడ్చి పార్కును చేయడంలో జాప్యం అవ్వడంతో అది కబ్జాదారులకు వరంగా మారింది. తర్వాత నిర్మాణాలు పెరగడంతో ఆ గుంతలు పూడ్చడం పెద్ద పనికాలేదు వారికి. ఇక అక్కడి నుంచి ఆ పార్కు స్థలాన్ని కబ్జా చేసి ఒకరు ఇసుక వ్యాపారం చేసుకుంటుండగా.. మరొక వ్యక్తి వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. మరొకరు కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ పార్కును కాపాడాలని 2018లో జీహెచ్ ఎంసీని అక్కడి నివాసితులు కోరారు. అయినా ప్రయోజనం లేదని వాపోయారు. ఈ అంశాలన్నిటీనీ పేర్కొంటూ హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారించారు. పార్కు స్థలంగా హైడ్రా అధికారులు నిర్ధారించుకున్నారు. ఆక్రమణదారులను ఖాళీచేయించి సుమారు 1452 గజాల మేర హైడ్రా ఫెన్సింగ్ వేసింది. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.
















