రూ. 1200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

గంధంగూడ‌లో 12.17 ఎక‌రాల భూమికి ఫెన్సింగ్

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : ఆక్ర‌మ‌ణ‌దారులు, క‌బ్జాదారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది హైడ్రా. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఉక్కుపాదం మోపుతున్నారు. ప్ర‌తి సోమ‌వారం హైడ్రా ఆధ్వ‌ర్యంలో ప్ర‌జా వాణిని ఏర్పాటు చేశారు. గ‌తంలో ఫిర్యాదు చేయాలంటే జంకిన వారంతా ఇప్పుడు ధైర్యంగా ముందుకు వ‌స్తున్నారు. ఫిర్యాదుల వెల్లువ మ‌రింత పెరిగింది. తాజాగా ఏకంగా రూ. 1200 కోట్ల‌కు పైగా విలువ క‌లిగిన క‌బ్జాకు గురైన 12.17 ఎక‌రాల‌ను కాపాడింది హైడ్రా. అంతే కాకుండా ఆక్ర‌మ‌ణ‌కు గురైన చెరువుల‌ను స్వాధీనం చేసుకుని పున‌రుద్ద‌రించే ప‌నిలో ప‌డింది. తాజాగా హైడ్రా బిగ్ షాక్ ఇచ్చింది ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండ‌లం గంధంగూడ గ్రామంలో 12.17 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది.

స‌ర్వే నంబ‌రు 43 ఉన్న ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఇదే స‌ర్వే నంబ‌రులో మొత్తం 26 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌గా.. ఇందులో ఒక ఎక‌రాను విద్యుత్ స‌బ్ స్టేష‌న్‌కు, మ‌రో 9 ఎక‌రాల‌ను జీహెచ్ ఎంసీ చెత్త వేయ‌డానికి ప్ర‌భుత్వం గ‌తంలో కేటాయించింది. ఈ కేటాయింపులు ఇలా ఉండ‌గా.. మిగిలిన భూమి క్ర‌మంగా క‌బ్జా అవుతోంద‌ని స్థానికుల నుంచి హైడ్రా ప్ర‌జావాణికి ఫిర్యాదు అందింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో క్షేత్ర స్థాయిలో హైడ్రా ప‌రిశీలించింది. ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించుకున్న త‌ర్వాత క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు ఫెన్సింగ్ వేసింది. ఇప్ప‌టికే ఒక ఆల‌యం, మాస్కు నిర్మాణం అక్క‌డ జ‌రిగింది. వాటిని కాపాడుతూనే ప్ర‌భుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి భ‌విష్య‌త్తులో క‌బ్జాల‌కు గురి కాకుండా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది. ప్ర‌భుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది.

Exit mobile version