రామంతాపూర్ చెరువులో షెడ్డును తొల‌గించిన హైడ్రా

ఎఫ్టీఎల్ ప‌రిధిలో అక్ర‌మంగా వెలిసిన నిర్మాణం గుర్తింపు

hellotelugu-HYDRAA

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను , చెరువుల‌ను క‌బ్జాకు గురి చేసిన వారికి ఝ‌ల‌క్ ఇస్తోంది. ఇప్ప‌టికే హైడ్రా ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి సోమ‌వారం ప్ర‌జా వాణి నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ఫిర్యాదుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టిస్తూ ఆక్ర‌మ‌ణ‌ల‌ను గుర్తించే ప‌నిలో ప‌డింది. తాజాగా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రామంతాపూర్ పెద్ద చెరువులో పూర్తి నీటి మట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిలోకి ఆక్రమించి నిర్మించిన ఒక షెడ్డును హైడ్రా అధికారులు తొలగించారు. సుమారు 400 చదరపు గజాల ఖాళీ స్థలంలో ఒక తాత్కాలిక షెడ్డును ఏర్పాటు చేసి, అక్కడ బార్ నిర్వాహకులు ‘సిట్టింగ్ రూమ్’ (మద్యపానానికి అనువైన ప్రదేశం)గా ఉపయోగిస్తున్నారు. పక్కనే ఉన్న భవనంలో బార్ నిర్వహణకు అనుమతులు పొందిన వారు, ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ షెడ్డును సిట్టింగ్ రూమ్‌గా వాడుకుంటున్నారు.

ఇక్కడ మద్యం సేవించి బయటకు వచ్చే వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మద్యం సేవించిన వారు బయటకు వచ్చి బహిరంగంగా తాగుతూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, అంతే కాకుండా పరిసర ప్రాంతాలను అపరిశుభ్రం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. రామంతాపూర్ పెద్ద చెరువును హైడ్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అనుమతి లేని సిట్టింగ్ రూమ్‌లు ఉండటం వల్ల ఈ అభివృద్ధి లక్ష్యానికి భంగం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు చెరువు కట్టపై కూర్చుని మద్యం సేవించి, ఖాళీ సీసాలను చెరువులోకి విసిరేస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న హైడ్రా చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చిన ఆ షెడ్డును తొలగించి, ఆ స్థలాన్ని చెరువు అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా మార్చుకుంది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Exit mobile version