అమరావతి : పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్రంగా బలపడింది. గత ఆరు గంటలుగా ఇది గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను చెన్నైకి 260 కి.మీ, నెల్లూరుకు 290 కి.మీ, మచిలీపట్నానికి 320 కి.మీ, కావలికి 310 కి.మీ, ఒంగోలుకు 330 కి.మీ, విశాఖపట్నానికి 470 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది అర్ధరాత్రి దాటిన తర్వాత నెల్లూరు – నర్సాపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో గాలి వేగం గంటకు 100 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. నేడు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు, అలాగే మార్కాపురం, నెల్లూరు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు పడవచ్చు.
ఈ జిల్లాల్లోని కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో, అలాగే నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్త చర్యగా 6 ఎన్డీఆర్ఎఫ్ , 7 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించడం జరిగిందని ఈ సందర్బంగా పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తుపాను దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించిందని పేర్కొన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలలని ఆదేశించారు.
