హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలతో ప్రజల ఇబ్బందులు తప్పిన సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అడ్డుగోడ తొలగిస్తే 3 కిలోమీటర్లు.. లేదంటే 8 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవస్థలకు హైడ్రా చెక్ పెట్టింది. మాది గేటెడ్ కమ్యూనిటీ అంటూ 40 ఫీట్ల రహదారిని మూసేసి నిర్మించిన ప్రహరీని హైడ్రా తొలగించింది. దీంతో 5 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన కష్టం మల్లంపేట ప్రాంత నివాసితులకు తీరింది. ఔటర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 4 నుంచి మల్లంపేట, బాచుపల్లి క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రగతినగర్‌కు సులభంగా చేరుకునే మార్గం దొరికింది.
మల్లంపేటలో రహదారికి అడ్డంగా ప్రణీత్ ఆంటీల్యా నిర్మించిన ప్రహరీపై హైడ్రాకు ఫిర్యాదు అందింది. రహదారికి ఆటంకాలు సృష్టించడంపై ప్రణీత్ ఆంటీల్యా నిర్వాహకులకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. హైడ్రా నోటీసుపై ప్రణీత్ ఎన్టీల్యావారు హై కోర్టును ఆశ్రయించారు. డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని హైకోర్టు హైడ్రాకు సూచించింది. ఈ మేరకు ఇరుపక్షాలు పిలిచి చర్చించింది. హెచ్ ఎం డీఏ అనుమతించిన ఔట్ ప్రకారం గేటెడ్ కమ్యూనిటీ కాదు అని నిర్ధారించుకున్నది . గేటెడ్ కమ్యూనిటీ నిబంధనల మేరకు ప్రత్యేకంగా దారుల కేటాయింపులు కూడా జరగలేదు. హైకోర్టు సూచనల మేరకు నోటీసులు ఇచ్చి రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీనీ హైడ్రా తొలగించింది. బిటి రోడ్డు కూడా వెంటనే చేపట్టింది.
ప్రహరీ తొలగడంతో ఆ దూరం 3 కిలోమీటర్లకు తగ్గింది. మల్లంపేట ఎగ్జిట్ నుంచి మల్లంపేట విలేజ్, ప్రణీత్ లీఫ్‌కాలనీ, ఆకాష్ వెంచర్, డ్రీం వ్యాలీ కాలనీ, గ్రీన్‌పార్కు కాలనీ, సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ, ఏపీఆర్ కాలనీ, ఇందిరమ్మకాలనీ, లక్ష్మి శ్రీనివాస్ కాలనీ, హెచ్ ఎండీఏ, ప్రణీత్ ఆంటిల్యా, బాచుపల్లి చౌరస్తా మీదుగా ప్రగతినగర్‌కు కేవలం 3 కిలోమీటర్ల రాజమార్గంలో రాడానికి అవకాశం లభించింది.
