హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కులకు చెక్ పెడుతోంది. చుట్టూ ఎత్తైన కొండల మధ్య సీక్రేట్ లేక్ గా పేరుగాంచిన దుర్గం చెరువును కబ్జాల చెర నుంచి హైడ్రా విడిపిస్తోంది. మాధాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ వైపు దుర్గం చెరువులో దాదాపు 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను హైడ్రా తొలగించింది. మట్టితో నింపి వాహనాల పార్కింగ్ కోసం వినియోగించి ప్రతి నెలా రూ. 50 లక్షల వరకూ అద్దెలు వసూలు చేస్తున్న దందాకు హైడ్రా చెక్ పెట్టింది. అక్కడి వాహనాలను ఖాళీ చేయించి ప్రస్తుతానికి ఫెన్సింగ్ వేసింది. తర్వాత మట్టిని తొలగించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. అక్కడ బాహాటంగా జరిగిన కబ్జాలపై ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో విచారణ చేయమని ఆదేశించారు. ఈమేరకు పరిశీలించిన హైడ్రా అధికారులు కబ్జాలను నిర్ధారించుకున్నారు.
హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం 5 ఎకరాల మేర ఉన్న ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. గోల్కొండ కోటలోని రాజ వంశానికి తాగు నీరందించిన దుర్గం చెరువుకు ఆక్రమణల దుర్గంధం అంటుకుంది. చుట్టూ కొండల మధ్య ఎంతో శుద్ధమైన జలాలతో దాహార్తిని తీర్చిన ఈ చెరువు కబ్జాలతో కుంచించుకు పోయింది. నగరం నడిబొడ్డున ఐటీ కారిడార్‌లో అందమైన సరస్సుగా అలరించిన దుర్గం చెరువు మురుగునీటితో దుర్గంధంగా మారింది. ఒకప్పుడు 160 ఎకరాల మేర ఉన్న చెరువు నేడు 116 ఎకరాలుగా మిగిలి పోయింది. చెరువుకు ఉత్తర దిశ తప్పితే.. మూడు వైపులా ఆక్రమణలకు గురైంది. 1976 నాటికే 29 ఎకరాల వరకూ కబ్జా అయి.. 131.66 ఎకరాలకు మిగిలి పోయింది.
