హైదరాబాద్ : అనేక దేవాలయాలకు కొలువై ఉన్న జగద్గిరిగుట్ట ఉన్న కోనేరు (గుండం) కబ్జాకు గురవుతుందని , దీనిని కాపాడాలని అక్కడి గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి రోధిస్తూ వేడుకున్న వీడియో అందరికీ గుర్తే ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోను చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ . కోనేరు పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కోనేరు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అందులో పేరకు పోయిన పూడికను తరలించింది. దాదాపు 26 ట్రక్కుల వరకూ ఉన్న నిర్మాణ వ్యర్థాలు, చెత్త, చెదారాన్ని తొలగించి కోనేరుకు కొత్త కళను అందించింది. ఒక ఎకరా వరకూ ఉన్న కోనేరును ఆక్రమించి మట్టితో నింపి.. పార్కింగ్ కోసం అక్కడి వారు వినియోగించు కుంటున్నారు.
ఇలా మొత్తం కోనేరునే కబ్జా చేయాలనుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. ఆ కోనేరు పునరుద్ధరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దీంతో స్థానికులతో పాటు ఆలయ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కబ్జాలను నియంత్రిచడంలో హైడ్రా చొరవను అభినందించారు. ఇదిలా ఉండగా 22 ఏళ్ల పోరాటం ఫలించిందని గోవిందరాజుల స్వామి ఆలయ పూజారి నరహరి అన్నారు. కోనేరును చూడకుండానే జీవితం అంతమౌతుందేమో అని ఆందోళన చెందారు. ఇప్పుడు హైడ్రా రూపంలో ఆ భగవంతుడే.. కోనేరు పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి.. కబ్జాలను తొలగించిన హైడ్రా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
