AV Ranganath : హైదరాబాద్ – భారీ వర్షాల కారణంగా భాగ్యనగరం అతలాకుతలంగా మారింది. ఎక్కడ చూసినా కాలనీలు నీట మునిగాయి. రహదారులపై నీళ్లు నిలిచాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా చోట్ల మురుగు నీరు ప్రవహిస్తోంది. కొన్ని ప్రాంతాలు నీళ్లలోనే ఉండి పోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా
ఒక్కసారిగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నీట మునిగిన అమీర్ పేట, మైత్రీవనం , మెట్రో స్టేషన్ పరిసరాలను హైడ్రా (Hydraa) కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) పరిశీలించారు. భారీ వర్షానికి జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డి గూడ ప్రాంతాలతో పాటు, మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రహదారిపై నీరు నిలిచిందని స్థానిక అధికారులు కమిషనర్ కు వివరించారు. 40 అడుగుల వెడల్పుతో పై నుంచి వచ్చిన వరద కాలువలు అమీర్ పేట – సంజీవరెడ్డి నగర్ ప్రధాన రహదారి దాటే సమయంలో 10 అడుగులకు కుంచించుకు పోవడంతో ఈ సమస్య తలెత్తిందని చెప్పారు.
Hydraa Commission AV Ranganath Key Comments
అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద నిర్మించిన కల్వర్టులో వున్న పైపు లైన్లలో ఒకటి పూడికతో మూసుకు పోవడంతో సమస్య తీవ్రమైందన్నారు. వెంటనే పైపు లైన్లలో పూడికను తొలగించాలని కమిషనర్ సూచించారు. అప్పటికీ సామర్థ్యం సరిపోక పోతే పైన వాహన రాకపోకలకు ఆటంకం కలగకుండా టన్నెల్ మాదిరి పనులు చేపట్టి అదనంగా పైపులైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం లక్డికాపూల్ ప్రాంతాలను పరిశీలించారు. చౌరస్తాలో పైపులైన్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఏవీ రంగనాథ్. కొత్తగా పైపులైన్లు వేస్తున్నప్పుడు బారికేడ్లను ఏర్పాటు చేయాలని.. లేని పక్షంలో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ఈ వర్షాకాలంలో వరద ముంచెత్తకుండా తక్షణ చర్యలతో ఉపశమనం లభించేలా, సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని సూచించారు.
Also Read : BRS Meet EC Sensational : ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు రావాలి
