జ‌గ‌న్ రెడ్డి హ‌యాంలో గ్రూప్ -1లో భారీ స్కాం

సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ కామెంట్స్

hellotelugu-chandraBabuNaiddu

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. అసెంబ్లీ సాక్షిగా సీరియ‌స్ కామెంట్స్ చేశారు. త‌న హ‌యాంలో గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేశాడ‌ని ఆరోపించారు. ప్ర‌ధానంగా గ్రూప్ -1లో భారీ స్కాం చోటు చేసుకుంద‌న్నారు. పరీక్షల్లో పేపర్లు లీక్ అయితే మంత్రులు రాజీనామా చేసిన రోజులు ఉన్నాయన్నారు. కానీ దీనికి బాధ్య‌త వ‌హిస్తూ ఏ ఒక్క‌రైనా స్పందించారా అని ప్ర‌శ్నించారు సీఎం. ఎదురుదాడి చేసేందుకు 24 గంటలూ కుట్రలు చేయటం కాదని, బాధ్యతా యుతంగా వ్యవహరించాల‌న్నారు. ప్రజలు, మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఈ తరహా అక్రమాలు జరక్కుండా చర్యలు తీసుకుంటాం అని హెచ్చ‌రించారు. ఏపీ శాసనసభలో 344 నిబంధన కింద ప్రత్యేక చర్చలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ – 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్ర‌స్తావించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏపీపీఎస్సీ ఏర్పడిందన్నారు సీఎం. రాష్ట్ర సర్వీసులోకి వచ్చే అధికారులను గ్రూప్-1 అందిస్తుందన్నారు నారా చంద్ర‌బాబునాయుడు. ఎంతో శ్రమించి అభ్యర్ధులు ఉద్యోగాలు సాధించుకుంటారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రూప్ – 1 సర్వీసు ఎంపిక పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బరితెగించి అక్రమాలకు పాల్పడిన వ్యవహారం గత పాలనలో చేశారన్నారు. ప్రజలు, ఉద్యోగార్ధులు కూడా ఈ అంశాలను క్షుణ్ణంగా తెలుసు కోవాల‌న్నారు. అసెంబ్లీ జవాబు దారీ తనానికి వేదిక, దీని నుంచే ప్రజలకు వివరాలు చెప్పాలన్నారు. ఈ తరహా అక్రమాలు మళ్లీ పునరావృతంగా కాకుండా సంస్థలో కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేస్తాం అన్నారు సీఎం.

2019-24 మధ్య విధ్వంసం జరిగిందని చాలాసార్లు చెప్పానని పేర్కొన్నారు. ప్రజావేదికతో మొదలు పెట్టి రాష్ట్ర బ్రాండ్ వరకూ దెబ్బతీశారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంలోని వివిధ వ్యవస్థలపై విశ్వాసం పోయేలా గత పాలకులు వ్యవహరించారని పేర్కొన్నారు. 2018లో జారీ చేసిన గ్రూప్ – 1 సర్వీసుల నోటిఫికేషన్ విడుదల చేస్తే 1.14 లక్షల మంది దరఖాస్తు చేశారని తెలిపారు. ఇందులో 325 మందిని షార్ట్ లిస్ట్ చేశారన్నారు. పదో తరగతి పరీక్షలు జరిగితే జవాబు పత్రాలను అత్యంత భద్రత మధ్య పోలీసు ఎస్కార్టుతో తరలిస్తాం అన్నారు సీఎం. అలాంటిది రాష్ట్రాన్ని పాలించే అధికారుల నియామకాలకు సంబంధించి పరీక్షలు జరిగితే ఇంకెంత భద్రంగా ఉండాలని ప్ర‌శ్నించారు.

Exit mobile version