అమరావతి : ఏపీ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. రానున్న సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ఆప్కో షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ అమ్మకాలు చేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. 60, 50, 40 శాతాల డిస్కౌంట్ ల పై చేనేత వస్త్రాలను విక్రయించనున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. తిరుమల వెంకన్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తిరుపతిలో చేనేత బజార్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మరో రెండ్రోజుల్లో చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను కొనుగోలు చేయనున్నామని తెలిపారు మంత్రి ఎస్. సవిత. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో చేనేత, జౌళి శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మెగా క్లస్టర్ల ఏర్పాటు, గడిచిన మూడు నెలల్లో ఆప్కో అమ్మకాలపై మంత్రి ఆరా తీశారు.
ఈ సందర్భంగా సవిత మాట్లాడారు. రానున్న సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 60 శాతం డిస్కౌంట్ అమ్మకాలపై గుంటూరులోని చేనేత ఏడీ కార్యాలయ ఆవరణలోనూ, మంగళగిరిలోని యర్రబాలెంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. విజయవాడలోని ఆప్కో మెగా షో రూమ్ లో 50 శాతం డిస్కౌంట్ అమ్మకాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 29వ తేదీ నుంచి ప్రత్యేక డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ఆప్కో షో రూమ్ ల్లో 40 శాతంపై డిస్కౌంట్ అమ్మకాలు సంక్రాంతి వరకూ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

















