చెన్నై | నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరించినందుకు డీఎంకేను కాంగ్రెస్ నాయకులు విమర్శించడంపై ఆ పార్టీ ఎంపీ కనిమొళి సీరియస్ గా స్పందించారు. దురదృష్టవశాత్తు తమిళనాడులో డీఎంకే , కాంగ్రెస్ మధ్య ఉన్న చరిత్రను కాంగ్రెస్ మర్చిపోయిందని నేను భావిస్తున్నానని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా అనేక సందర్భాల్లో మేము కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూడా నిలబడ్డామని పేర్కొన్నారు ఎంపీ. ప్రజాస్వామ్యానికి, మా భాషకు లేదా మా అస్తిత్వానికి ముప్పు కలిగించేలా వారు వ్యవహరించిన ప్రతిసారీ, డీఎంకే మాత్రమే దానికి వ్యతిరేకంగా పోరాడిందని స్పష్టం చేశారు కనిమొళి. తమిళ ప్రజలను ఎవరు నిరాశపరిచారో మాకు తెలుసు, అలాగే తమిళనాడు ప్రజల పక్షాన డీఎంకే ఎప్పుడూ నిలిచిందని మాకు తెలుసు, ఇంకొకరు తమ గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు ఎంపీ.
అప్పటికీ ఎప్పటికీ తాము ఇక ముందు కూడా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు . మేము ఎవరో మాకు చెప్పడానికి మాకు మరొకరి అవసరం లేదన్నారు కనిమొళి. మేము అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఆమోదించాం. ఆ సమావేశంలో పాల్గొనడానికి ఐదు వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం జరిగిందని చెప్పారు ఎంపీ. ఆ సమావేశంలో ఇద్దరు కాంగ్రెస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు .. ఆమోదించిన తీర్మానాన్ని అంగీకరించారు. ఆ సమావేశం మొత్తం న్యాయబద్ధమైన నియోజకవర్గాల పునర్విభజన గురించే జరిగిందన్నారు. అప్పుడు డీఎంకే వైఖరి అదే, ఇప్పుడు కూడా అదే. మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు.
