అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహరిస్తున్నా ఎందుకని ఇంకా ఆయనను వెనుకేసుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఒక మహిళను మోసం చేసి.. వీడియోలు, ఫోటోలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ చైర్మన్ పై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం జగన్ మీడియాతో మాట్లాడారు. తనను మోసం చేసిన టీటీడీ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని గతంలోనే చంద్రబాబుకు బాధిత మహిళ లేఖ రాసిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఇలాంటి వాళ్లా దేవుడి గురించి, పవిత్రత గురించి, మహిళల గురించి మాట్లాడేది అంటూ మండిపడ్డారు. అంతే కాకుండా తిరుమల నెయ్యి సరఫరాలో భారీ స్కాం చోటు చేసుకుందని ఆరోపించారు. నెయ్యి టెండర్లలో ఇప్పటి వరకూ రూ.200 కోట్ల కుంభకోణం బయట పడిందన్నారు. ఉద్దేశ పూర్వకంగా ఏడాది కాలంలో కేజీ నెయ్యి రేటును రూ.351 నుంచి రూ.716కు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ మోహన్ రెడ్డి. ఇదిలా ఉండగా తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యి వ్యవహారంలో తమ పార్టీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదన్నారు. ఇందాపూర్ డెయిరీ-హెరిటేజ్ మధ్య సంబంధాల గురించి నిలదీసినా నోరు మెదపడం లేదని ఎందుకని నిలదీశారు.
