అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు.
అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. సాంప్రదాయ పూజాదికాలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పూజలు నిర్వహించిన అనంతరం నందమూరి బాలకృష్ణ స్వయంగా ప్రొక్లైన్ ను నడిపి మట్టిని తవ్వి టిప్పర్ లోనికి ఎత్తి పోయడం అందరినీ ఆకట్టుకొంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తన తల్లిగారైన నందమూరి బసవతారకం పేరుతో నిర్మాణ మవుతున్న ఈ నూతన హాస్పిటల్ ను రెండు దశలలో నిర్మిస్తామని తెలిపారు. మొదటి దశలో షుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో 500 పడకల హాస్పిటల్ నిర్మించి రోగులకు అందుబాటులోనికి తీసుకొని వస్తామని వివరించారు.
ఈ నూతన హాస్పిటల్ లో క్యాన్సర్ చికిత్స కు అవసరమైన అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో పాటూ నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. మొత్తం 21 ఎకరములలో నిర్మాణవుతున్న హాస్పిటల్ యొక్క మొదటి దశను 2028 నాటికి పూర్తి చేసి రోగులకు సేవలు అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. హైదరాబాదులో హాస్పిటల్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన నేపధ్యంలో హైదరాబాదులో భారీ కార్యక్రమం నిర్వహించ బోతున్నామని వెల్లడించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్, సభ్యులు , ట్రస్టు బోర్డు మెంబర్స్ పాల్గొన్నారు.
