పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్.సవిత నేతృత్వంలో బీసీ బిడ్డలకు విద్యతో పాటు ఆరోగ్య భద్రత, నాణ్యమైన ఆహారం అందిస్తోంది. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఇటీవల విడుదలైన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో బీసీ బిడ్డలు అత్యున్నతమైన ఫలితాలు సాధించడమే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజక వర్గంలో వెనుకబడిన తరగతి విద్యార్థులందరికీ విద్య అందేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజక వర్గంలో కొత్తగా మూడు బీసీ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పరిగి, రొద్దం, సోమందేపల్లిలో ఏర్పాటు చేయబోయే ఈ బీసీ హాస్టళ్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి ఇప్పటికే చర్యలు చేపట్టింది. పరిగి, రొద్దంలో బాలికల హాస్టళ్లను, సోమందేపల్లిలో బాలుర హాస్టల్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా మంత్రి సవిత ప్రకటించారు. ఈ మూడు హాస్టళ్ల నిర్వహణకు హెచ్.డబ్ల్యూ.వో.లను(వార్డెన్లు) నియమించే పనిలో జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులు తల మునకలయ్యారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే హాస్టళ్లలో బీసీ విద్యార్థులు చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలో 61 బీసీ హాస్టళ్లు ఉన్నాయి. పెనుకొండ నియోజ వర్గంలో నాలుగు బీసీ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో రెండు పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు కాగా, మరో రెండు ప్రీ మెట్రిక్ హాస్టళ్లు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయబోయే మూడు హాస్టళ్లను కలిపి జిల్లాలో హాస్టళ్ల సంఖ్య 64కు చేరుకోనుంది.

















