ములుగు జిల్లా : రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల సంక్షేమం కోసం హెల్ప్లైన్లను ప్రారంభించారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. ఏటూరు నాగారంలోని ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ తోప్పో , ఇతర అధికారులతో కలిసి ఐటీడీఏ పరిధిలోని విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు , విద్యార్థుల సంక్షేమంపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గిరిజన విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు విద్యా ప్రమాణాలను మెరుగు పరచడమే లక్ష్యమని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులు విద్యాపరంగా రాణించేలా, మెరుగైన ఫలితాలను సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని ఆమె సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని, అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను , వారికి తోడ్పడిన ఉపాధ్యాయులను గుర్తించి అభినందించాలని ఆమె కోరారు.
విద్యా సంస్థల్లో మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించాలని, మౌలిక సదుపాయాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు, ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేయాలని సీతక్క సూచించారు. గిరిజన గురుకులాలు, సంక్షేమ విద్యా సంస్థలు , హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకు వచ్చేందుకు మంత్రి సీతక్క, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రత్యేక టోల్-ఫ్రీ నంబర్లను, వాట్సాప్ హెల్ప్లైన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్ప్‌లైన్ నంబర్లు ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేశారు. విద్యార్థులు తమ సమస్యలను తెలియ జేయడానికి 1800-425-3369 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా +91 9493368361 నంబర్‌కు వాట్సాప్‌లో సందేశం పంపవచ్చు. ఈ సదుపాయాన్ని సక్రమంగా ఉపయోగించు కోవాలని మంత్రి విద్యార్థులను కోరారు.
