ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హైజాక్ చేశారు : జ‌గ‌న్ రెడ్డి

అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని కామెంట్స్

hellotelugu-YSJagan

Vijayawada, Nov 28 (ANI): YSR Congress Party President YS Jagan Mohan Reddy addresses the media dismissing the allegations linking him to the alleged Gautam Adani-owned firm bribery case in the US, in Vijayawada on Thursday. (ANI Photo)

తాడేప‌ల్లి గూడెం : వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవి ఎల‌క్ష‌న్స్ కావ‌ని సెల‌క్ష‌న్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అన్నారు. ఈ ఎన్నికల్లో ఆ సూత్రాన్నే పూర్తిగా హైజాక్‌ చేశారని ఆరోపించారు. గురువారం తాడేప‌ల్లి గూడెంలో మీడియాతో మాట్లాడారు. శకుని మాయా పాచికల మాదిరిగా అధికార దుర్వినియోగం, రౌడీయిజంతో ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని నిర్వీర్యం చేశార‌ని మండిప‌డ్డారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌, 143 హామీలతో ఇంటింటికీ వెళ్లి బాండ్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేయక పోవడంతో ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేక ఎన్నికలనే హైజాక్‌ చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన వెంటనే వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులను బైండోవర్‌ పేరుతో పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి బెదిరింపులు, అరెస్టులతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

టీడీపీ గూండాలతో పోలీసులు కుమ్మక్కై వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నార‌ని ఆరోపించారు. స్క్రూటినీ సమయంలో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్‌ పత్రాలను మాయం చేయడం, సంతకాలను ఫోర్జరీ చేయడం, నామినేషన్లను అడ్డగోలుగా తిరస్కరించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని బలవంతపు విత్‌డ్రావల్స్‌ చేయించారని వాపోయారు జ‌గ‌న్ రెడ్డి. ముఖ్యమంత్రి నుంచి కలెక్టర్లు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఓల వరకు ఒక మాఫియా ముఠాలా వ్యవహరించారని ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థకు రిఫరీగా ఉండాల్సిన ఎస్‌ఈసీ సైతం చంద్రబాబుకు తొత్తుగా మారడంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలే విఫలమయ్యాయని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 17 మున్సిపాలిటీల్లో వైయ‌స్ఆర్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులను నామినేషన్‌ వేయనీయలేదని అన్నారు. మరో 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్‌ దశలోనే పోటీ లేకుండా చేశారని పేర్కొన్నారు. పులివెందులలో 40 వార్డులకు కేవలం 20 వార్డుల్లోనే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగలిగార‌ని తెలిపారు.. మిగిలిన వార్డుల్లో పోటీ లేకుండా చేశారన్నారు. కాళ్లు చేతులు కట్టేసి పోటీలోకి దింపిన పరిస్థితుల్లోనూ పోలింగ్‌ రోజున వైయ‌స్ఆర్‌సీపీ ఏజెంట్లను బూత్‌ల్లో కూర్చోనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. పోలీసుల కళ్ల ముందే టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నా పట్టించుకోని పరిస్థితి నెల‌కొంద‌న్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా ఇలాంటి ఎన్నికలను అసలు ఎన్నికలు అని పిలవగలమా? అని ప్ర‌శ్నించారు.

Exit mobile version