పూర్వోద‌య‌, సాస్కీ ద్వారా ఏపీని ఆదుకోండి

నిర్మ‌లా సీతారామ‌న్ కు సీఎం చంద్ర‌బాబు విన‌తి

hellotelugu-APCM

ఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు రాష్ట్ర మంత్రుల‌తో క‌లిసి. శుక్ర‌వారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి భేటీయ్యారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ కు చేయూత ఇవ్వాలని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని విన్న‌వించారు. కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని అన్నారు. దేశంలోని తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే పూర్వోదయ పథకం వికసిత్ భారత లక్ష్యాన్ని చేరుకునేందుకు, జాతీయ ఆర్ధిక వ్యవస్థకు చోదకశక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ, సాగునీటి పారుదల వ్యవస్థల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల నిర్మాణం, విద్య వైద్య రంగాల సదుపాయాల కల్పన కోసం పూర్వోదయ పథకం కీలకంగా మారుతుందని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. తద్వారా ఆయా గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన ఆర్దిక అవకాశాలను అందిస్తుందని స్పష్టం చేశారు. విద్య, నైపుణ్య కల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ పథకం కింద ప్రాధాన్యతా క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనల్ని సరళీకృతం చేయాలని అన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని కోరారు.

Exit mobile version