బెంగళూరు : శ్రీ రవిశంకర్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన గురూజీతో భేటీ అయ్యారు.
గతంలో మేం కూడా ప్రజాప్రతినిధులు, అధికారులకు కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా తరగతులు నిర్వహించాం అని తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వెలసిన నేల నుంచి నేను వచ్చాను. ప్రపంచంలో ఉండే హిందువులంతా ఒక్కసారైనా తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటారు.శ్రీశైలం, ఆహోబిలం, అన్నవరం, సింహాచలం లాంటి అధ్యాత్మిక క్షేత్రాలు నిండిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు . అందుకే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను రాష్ట్రంలో నిర్మిస్తున్నామని చెప్పారు సీఎం. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఆభివృద్ధి అంటే కేవలం ఆర్ధిక ప్రగతి, టెక్నాలజీ మాత్రమే కాదు ప్రజల జీవన ప్రమాణాలు మార్చటమేనని పేర్కొన్నారు.
ప్రతీ పౌరుడూ శాంతి సౌఖ్యాలు, ఆనందంగా జీవించాలన్నదే నా అభిప్రాయం. ఏపీ సమీకృత అభివృద్ధి సాధించాలన్నదే నా లక్ష్యం కూడా అని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. ఏపీలోని ప్రతీ పౌరుడికీ అత్యుత్తమ జీవన ప్రమాణాలు కల్పించేలా సంకల్పం తీసుకున్నాం. అందుకే పీ4 లాంటి కార్యక్రమాలు చేపట్టాం అన్నారు. అందుకే స్వర్ణాంధ్ర 2047 విజన్ కూడా అమలు చేశాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీని తయారు చేయటమే నా లక్ష్యం అని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు. సాంకేతికత సాయంతో ఏపీని గ్లోబల్ ఎకానమీలో ఓ కీలకమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం అన్నారు. అదే సమయంలో ఎలాంటి ఒత్తిడి లేని సమాజాన్ని కూడా తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. విధానకర్తగా మేం అభివృద్ధి వైపుగానే ఆలోచన చేయగలం అన్నారు. స్పేస్, డ్రోన్, డేటా సెంటర్లు ఏపీలో ఏర్పాటు అవుతున్నాయి. మొదటి క్వాంటం కంప్యూటర్ ఏపీలో ఏర్పాటు అవుతోందని చెప్పారు.
