అమరావతి : రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని భారీగా పెంచే దిశగా చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. జూన్ 2024 నుంచి విద్యుత్ రంగంలో 103 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా రూ.4.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో విద్యుత్ రంగానికి సంబంధించి రూ.2.56 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఒప్పందాలు కార్యరూపం దాల్చడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఎంవోయూలు చేసుకున్న ప్రతి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 కింద రాష్ట్రంలో రూ.21,838 కోట్లతో భారీ విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ కారిడార్ ద్వారా 47 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్ధ్యానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరగా టెండర్లు పిలిచి, రెండేళ్లలోగా కార్యరూపంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 36,050 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు వివరించారు. పోలవరం పరిసర ప్రాంతాల్లో 27 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై మరింత పరిశోధన, అధ్యయనం జరగాలని సీఎం సూచించారు. పీఎం సూర్య ఘర్ పథకం అమలులో ప్రస్తుతం దేశంలో నాలుగో స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకువె ళ్లాలని సీఎం నిర్దేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో పాటు… సాగునీటి ప్రాజెక్టులు, కాలువ గట్లపై సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాల్సి ఉందన్నారు. సోలార్ రూఫ్ టాప్‌లో నాయుడుపేట, మాచర్ల, నరసరావుపేట డివిజన్లు ముందున్నాయని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 7.42 లక్షల రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు పూర్తి చేసినట్టు అధికారులు పేర్కొనగా, 10 లక్షల లక్ష్యాన్ని డిసెంబర్ నాటికి చేరుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పీఎం కుసుమ్ పథకం కింద 224 ప్రాంతాల్లో 1,162 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల పనుల్లో పురోగతి ఉందని అధికారులు వివరించారు. పీఎం కుసుమ్ ప్రాజెక్టుల కోసం భూసేకరణ 100 శాతం పూర్తి చేశామని, అలాగే సివిల్ పనులు 91 శాతం పూర్తయినట్టు తెలిపారు


















