చిన్న మత్స్య పరిశ్రమలకు రూ.2 కోట్ల వరకు గ్రాంట్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి ప్ర‌భుత్వం

hellotellugu-APGovt

అమ‌రావ‌తి : ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన (PM-MKSSY) కింద దేశ వ్యాప్తంగా రూ.6 వేల కోట్ల అంచనా వ్యయంతో మత్స్యరంగ అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఏపీ స‌ర్కార్ తెలిపింది. అర్హత కలిగిన సూక్ష్మ పరిశ్రమలకు 25 శాతం లేదా గరిష్ఠంగా రూ.35 లక్షలు, ఎస్సీ, ఎస్టీ, మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ పరిశ్రమలకు 35 శాతం లేదా రూ.45 లక్షల వరకు పనితీరు ఆధారిత గ్రాంట్‌కు అవకాశం ఉందని పేర్కొంది. చిన్న పరిశ్రమలకు కేటగిరీని బట్టి రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు, మత్స్య సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు, మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు గ్రాంట్ పొందే అవకాశం ఉందని వెల్ల‌డించింది స‌ర్కార్.

సముద్రంలో చేపల వేట సమయంలో ప్రమాదాలకు గురయ్యే మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపింది. వేట సమయంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా అందించే విధానం అమల్లో ఉందని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. 2026-27లో 2,84,888 మంది మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. పథకం నిబంధనల ప్రకారం ప్రమాద మరణం లేదా పూర్తిస్థాయి శాశ్వత వైకల్యానికి రూ.5 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యానికి రూ.2.50 లక్షల వరకు బీమా ప్రయోజనం లభిస్తుందన్నారు.

గోదావరి, కృష్ణా డెల్టాలు, కోరింగ మడ అడవులు, పులికాట్, కొల్లేరు సరస్సులు మత్స్య సంపద వృద్ధికి కీలకమని మంత్రి పేర్కొన్నారు. సహజ జలవనరుల పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, చేపల సంతానోత్పత్తి ప్రాంతాల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. మత్స్యకారుల ఆదాయం పెంచడంతోపాటు భవిష్యత్తు తరాలకు మత్స్య సంపదను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మత్స్యకారుల చెమట చుక్కలకు తగిన ప్రతిఫలం దక్కాలి. వారి కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గంగపుత్రుల సంక్షేమం, ఆక్వా రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Exit mobile version