శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంకు ఆద‌ర‌ణ

హోమంలో పాల్గొనే గృహస్తులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

hellotelugu-SrinivasaDivyanugrahaHomam

తిరుపతి :హిందూ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో అలిపిరి సప్త గోప్రదక్షిణ మండపంలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. సనాతన భారతీయ సంస్కృతిలో యజ్ఞ, యాగాదులకు అత్యున్నత స్థానం ఉంది. భక్తుల సంకల్పాలను భగవంతుని సన్నిధికి చేర్చే పవిత్ర వేదికగా ఈ హోమం కార్యక్రమాన్ని టీటీడీ 2023 నవంబరు 23న ప్రారంభించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో కొనసాగుతున్న ఈ దివ్య హోమం ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఎస్వీ వేద విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా జరుగుతోంది.

అత్యంత వ్యయ ప్రయాసలతో నిర్వహించాల్సిన ఈ హోమాన్ని సాధారణ భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ, భక్తుల కోరిక మేరకు 2025 ఆగస్టు 1 నుండి రోజుకు 200 టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా జారీ చేయాలని నిర్ణయించింది. టికెట్ పొందిన గృహస్తులు స్వయంగా హాజరై హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు రూ.7 కోట్ల వ్యయంతో దాదాపు 500 మంది గృహస్తులు ఒకేసారి పాల్గొనేలా విశాలమైన శాశ్వత యాగశాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది.

భక్తులకు సులభ దర్శనం కల్పించడమే కాకుండా భగవంతుని అనుగ్రహాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలనే మహోన్నత సంకల్పంతో టీటీడీ ఇప్పటికే శ్రీనివాస కళ్యాణాలు, వైభవోత్సవాలు, ఎస్వీబీసీ ప్రసారాలు, భజన బృందాలు, అన్నమాచార్య సంకీర్తన ప్రచారం, ఎస్వీ వేద విశ్వ విద్యాలయం వంటి అనేక ధార్మిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది.

భక్తులు తమ శుభకార్యాలు, జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు వంటి విశేష సందర్భాల్లో శ్రీవారి సన్నిధిలో సంకల్పం చెప్పుకుని ఈ హోమంలో పాల్గొని దివ్య ఆశీస్సులు పొందవచ్చు. రూ.1600/- చెల్లించి ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులు పాల్గొనే అవకాశం కల్పించారు. హోమంలో పాల్గొన్న వారికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా కల్పిస్తారు. ఈ టికెట్లను నెల రోజుల ముందుగానే టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.in ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి.

Exit mobile version