8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం

వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

hellotelugu-TirumalaDeepavali

తిరుమల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. న‌వంబ‌ర్ నెల‌లో దీపావ‌ళి పండుగ జ‌ర‌గ‌నుంది. ఈ సందర్భంగా శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. తిరుమల లోని శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8వ తేదీన‌ దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి నాడు ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుందని తెలిపింది టీటీడీ.

ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వ భూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామి వారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.

కాగా సాయంత్రం 5 గంట‌లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి వారు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు . ఇదిలా ఉండ‌గా దీపావ‌ళి ఆస్థానం కార‌ణంగా 8న క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం సేవ‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. అయితే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించ‌నున్న‌ట్లు పేర్కొంది.

Exit mobile version