ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటల నుండి 11.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గరుత్మంతుని సన్నిధులు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితరాలను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 11.30 గంటల నుండి భక్తులను సర్వ దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ప్రశాంతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జేఈవో వి. వీరబ్రహ్మం పర్యవేక్షణలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం ఆదేశాల మేరకు నిత్య అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.



















