తిరుపతి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా, మరింత ఆధ్యాత్మిక శోభ కనిపించేలా నిర్వహించనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను టిటిడి జేఈవో లు వి వీరబ్రహ్మం, డా. ఎ.శరత్, సివిఎస్వో కే వి మురళీకృష్ణ లతో కలిసి టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శనివారం ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ నివాస గృహంలోని ఈవో ఛాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో విశేష ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళ కళ లాడేలా చలువ పందిళ్లు, ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, రంగురంగుల ముగ్గులు, పుష్పాలంకరణలు, వైట్ పెయింటింగ్, సాంప్రదాయ చిత్రకళా అలంకరణలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు తదితర ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. మే 22న సాయంత్రం 5.30 గంటల నుండి 8 గంటల వరకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మే 23న ఉదయం 7.35 గంటల నుండి 8.49 గంటల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిర్వహించనున్న వాహన సేవలు భక్తి పారవశ్యాన్ని పంచనున్నాయి. ముఖ్యంగా మే 27న గరుడ వాహన సేవ, మే 30న రథోత్సవం బ్రహ్మోత్సవాలకు ఆకర్షణగా నిలవనున్నాయి.



















