హంస వాహ‌నంపై ఊరేగిన గోవిందుడు

వైభ‌వోపేతంగా వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

hellotelugu-HamsaVahanam

తిరుప‌తి : తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రాత్రి శ్రీ గోవింద రాజస్వామి వారు సరస్వతి దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అభయ ప్రదాతగా వెలుగొందారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహన సేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండ‌గా చెక్క భజనలు, కోలాటాలు, గోవింద నామ స్మరణలతో తిరుపతి మాడవీధులు మారుమోగాయి. మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహన సేవను తిలకించిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి దివ్యానుభూతిని పొందారు.

బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి, వివేకానికి ప్రతీకగా పురాణాలు పేర్కొంటాయి. పాలను నీటిని వేరుచేసే హంస స్వభావం ఆత్మానాత్మ వివేకానికి సంకేతం. అందుకే పరమాత్మతో ఏకత్వం పొందిన మహనీయులను “పరమహంసులు”గా ఉపనిషత్తులు అభివర్ణించాయి. భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తిని ప్రసాదించేందుకే శ్రీహరి హంస వాహనాన్ని అధిరోహిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. ఈ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శాంతి, ఏఈవో నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Exit mobile version