అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలనా పరంగా మరింత పారదర్శకతతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇవాళ సచివాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు తీరుపై సమీక్ష చేపట్టారు. పాలనలో దేశానికే ఏపీ రాష్ట్రం రోల్ మోడల్ గా ఉండాలని అన్నారు. పాలనలో వివిధ ప్రక్రియలను, నిబంధనల్ని మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. ఇందులో భాగంగా కొన్ని చట్టాలను కూడా సరళతరం చేసేలా నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ సేవలు అత్యంత సులభంగా ప్రజలకు చేరువ కావాలన్నదే తమ లక్ష్యమని నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీనిపై అధ్యయనం కోసం ఓ కమిటీ వేయాలని అన్నారు. క్యాంపు కార్యాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం మనం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆదర్శ ప్రాయంగా ఉందన్నారు. ఇదే క్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉండాలని పేర్కొన్నారు సీఎం. లేక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత జగన్ రెడ్డి సర్కార్ ఇష్టానుసారంగా పాలన సాగించిందని ఆరోపించారు.
ఇదిలా ఉండగా జరిగిన సమీక్షలో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పురపాలక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
