మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థల స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. విద్య , ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూనే, విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందిస్తోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం అల్వాల్‌లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ సైన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థల స్థాయికి సమానంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
విద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూనే, విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని ,సృజనాత్మకతను ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి , యువత తమ ఆలోచనలను సామాజిక ప్రయోజనం కలిగించే ఉత్పత్తులుగా మార్చుకోవడంలో మద్దతునిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను (ఎకోసిస్టమ్) రూపొందిస్తోందని ఆయన పేర్కొన్నారు. టి – హబ్ , టి – వర్క్స్ , వి – హబ్ వంటి సంస్థలు ఆవిష్కర్తలకు అండగా నిలుస్తున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. ఆవిష్కరణలు , నైపుణ్యాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, వాస్తవ జీవిత సమస్యలకు పరిష్కారాలను అన్వేషించడం, ప్రశ్నలు అడగడం, పరిశీలించడం ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ‘ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ను కోరారు.
