కేరళ : కేరళ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రజా రవాణా విస్తరణకు కేఎస్ఆర్టీసీ బస్సుల స్పాన్సర్‌షిప్‌ను ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాలతో సహా సేవల బలోపేతం , కాలపరిమితి ముగిసిన బస్సుల స్థానంలో కొత్త వాటిని ప్రవేశ పెట్టడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కేరళ ప్రభుత్వ రవాణా సంస్థ సంస్థలు , వ్యక్తుల నుండి బస్సుల స్పాన్సర్‌షిప్‌ను ఆహ్వానించింది. స్థానిక స్వపరిపాలన సంస్థలు, సహకార సంఘాలు, కంపెనీలు, ట్రస్టులు, సామాజిక సంస్థలు, క్లబ్బులు ,వ్యాపార సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఉపయోగించి లేదా నేరుగా బస్సులను స్పాన్సర్ చేయవచ్చని జారీ చేసిన మార్గదర్శకాలు పేర్కొన్నాయి. ఏసీ ప్రీమియం, ఏసీ సీటర్, ఏసీ స్లీపర్, సూపర్ ఫాస్ట్ , ఫాస్ట్ ప్యాసింజర్ బస్సులతో సహా 9 నుండి 15 మీటర్ల పొడవు గల బస్సులను సంస్థ స్వీకరిస్తుంది.
స్పాన్సర్లు వాహనాన్ని నేరుగా కొనుగోలు చేసి అప్పగించవచ్చు లేదా అవసరమైన మొత్తాన్ని కేరళ ఆర్టీసీ సంస్థకు అందించవచ్చు అని తెలిపింది. రెండో పద్ధతిలో అయితే, సంస్థ టెండర్ ప్రక్రియ ద్వారా బస్సును కొనుగోలు చేస్తుంది. స్పాన్సర్ చేసిన బస్సులు కేఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ పేరుతో నమోదు చేయబడతాయి. తదనంతరం సంస్థ శాశ్వత ఆస్తులుగా మారతాయి. బస్సుల నిర్వహణ, మరమ్మతులు, బీమా, టికెట్ ఆదాయం , సిబ్బంది నియామకంతో సహా వాటి కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ కేరళ ఆర్టీసీ సంస్థ వద్దే ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఉన్న సేవలకు ప్రత్యామ్నాయంగా స్పాన్సర్లు సూచించే మార్గాలను పరిగణనలోకి తీసుకుంటారు. స్థానిక స్వపరిపాలన సంస్థల సహకారంతో ఇంధన ఖర్చులు , ప్రాథమిక మౌలిక సదుపాయాలు సమకూర్చితేనే కొత్త సేవలను పరిగణనలోకి తీసుకుంటారు. దీని కోసం ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదుర్చుకోవచ్చు.
స్పాన్సర్లు 10 సంవత్సరాల పాటు బస్సులపై ప్రకటనలను ప్రదర్శించడానికి అనుమతించ బడతారు. అయితే మత పరమైన, రాజకీయ, చట్ట విరుద్ధమైన లేదా విభజనను ప్రేరేపించే ప్రకటనలకు అనుమతి ఉండదు. ప్రకటనల నమూనాలకు సంస్థ నుండి ముందస్తు ఆమోదం అవసరం. స్పాన్సర్ చేయబడిన బస్సులు ఇతర ఆర్టీసీ బస్సుల మాదిరిగానే ఒకే రంగుల విధానాన్ని కలిగి ఉంటాయి. వాహన రూపంలో ఏవైనా మార్పులు అవసరమైతే స్పాన్సర్లకు ముందుగానే తెలియ పరుస్తామని తెలిపింది.
