డబుల్ బెడ్రూమ్ ఇళ్ల‌పై స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

జూన్ 2న రెండో ద‌శ ఇళ్ల నిర్మాణం ప్రారంభం

hellotelugu-PonguletiSrinivasReddy

హైద‌రాబాద్ : రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇళ్ల నిర్మాణంపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వ దూరదృష్టి లోపం కారణంగా హైదరాబాద్ నగరానికి దూరంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించారని ఆరోపించారు. దాని ఫలితంగా తలెత్తిన సమస్యలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు, నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకుని, ప్రస్తుతం పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిని గుర్తించి, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ నగరానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన 2BHK ఇళ్లను పొందిన లబ్ధిదారులు, అది తమ జీవనోపాధిని ప్రభావితం చేయడంతో అక్కడ నివసించడానికి సుముఖంగా లేరని క్షేత్రస్థాయి అధ్యయనాలలో వెల్లడైందని ఆయన అన్నారు .ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, అదే నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు, మురికివాడలు, భూదాన్ భూములు, గత పథకాల కింద నిర్మించిన ఇళ్లు శిథిలావస్థలో ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని కూడా ఆయన ఆదేశించారు.

జిల్లా గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్లు మరింత చురుకుగా పనిచేసి, తమ పనితీరును మెరుగు పరుచుకోవాలని ఆయన కోరారు. తమ తమ అధికార పరిధిలో గతంలో నిర్మించిన అన్ని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, రాజీవ్ గృహకల్ప,  వాంబే హౌసింగ్ కాలనీలను సందర్శించాలని పీడీలను ప్రత్యేకంగా ఆదేశించారు.

Exit mobile version