అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది సహకార శాఖ లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి. ఇప్పటి వరకు పదోన్నతులు, పోస్టింగ్ విషయంలో గత సర్కార్ తాత్సారం చేయడాన్ని గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చొరవ తీసుకున్నారు. వెంటనే పదోన్నతులు, పోస్టింగ్ లు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో సహకార శాఖ అసోసియేషన్ ఉద్యోగులు మంత్రిని సన్మానించారు. కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.వి. ఫణి పేర్రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో సహకార శాఖలో వివిధ కేడర్లలో దాదాపు 350కు పైగా ప్రమోషన్లు కల్పించినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికతో ప్రమోషన్ ప్రక్రియ అమలు చేయడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతమైందన్నారు. అలాగే మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాలతో ప్రమోషన్లు, పోస్టింగులు అత్యంత పారదర్శకంగా అమలయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జీసీబీవీ కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు డి. విజయ్ కుమార్, పి. రాజశేఖర్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి జి. సందీప్, సహా అధ్యక్షుడు యు. రమేష్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు వై. యేసు కుమార్, గుంటూరు జిల్లా కార్యదర్శి ఎస్. భావనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
