తిరుపతి : తిరుపతిలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో సెప్టెంబరు 4న గోకులాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ జన్మదిన వేడుకలకు గోసంరక్షణశాల ఆధ్యాత్మిక వేదికగా నిలవనుంది. భక్తిభావాన్ని పెంపొందించేలా గోపూజతో పాటు వేదపఠనం, భజనలు, కోలాటాలు, సంకీర్తనలు, హరికథ తదితర కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది. గోవులను ప్రేమించిన గోపాలకృష్ణుని జన్మ దినమైన గోకులాష్టమికి గో సంరక్షణశాలలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సనాతన ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తూ గోసేవ, గోపూజలకు విశిష్ట స్థానం కల్పించారు. ఈ సంప్రదాయాన్ని భక్తుల్లో మరింతగా పెంపొందించే ఉద్దేశంతో టీటీడీ ప్రతి ఏటా గోకులాష్టమి వేడుకలను నిర్వహిస్తోంది.
గోకులాష్టమి సందర్భంగా గో సంరక్షణశాలను మామిడి తోరణాలు, పూలమాలలు, ప్రత్యేక అలంకరణలతో గోకులాన్ని తలపించేలా తీర్చి దిద్దుతున్నారు. గోవులను అందంగా అలంకరించి భక్తులకు కనువిందు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు గోవులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసం అందించి గోసేవలో భాగస్వాములు కావచ్చు. గోమాతకు గ్రాసదానం పుణ్య ప్రదమని విశ్వసించే భక్తులు ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
గోకులాష్టమి రోజున ఉదయం 5 గంటలకు శ్రీ వేణు గోపాల స్వామివారికి అభిషేకం, 6 గంటలకు వేణుగానం, 7.30 గంటలకు వేదపఠనం నిర్వహిస్తారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులచే భజనలు, కోలాటాలు, ఉదయం 8 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే శ్రీహరి సంకీర్తనలు ఆలపిస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీ వేణు గోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి నిర్వహిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులకు స్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.
సాయంత్రం టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని దివ్య లీలలు, గోసేవ మహత్యాన్ని వివరించే హరికథ నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ నామస్మరణతో.. గోమాత సేవతో.. భక్తి పారవశ్యంతో సాగనున్న గోకులాష్టమి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోపూజ, గోసేవలో భాగస్వాములు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
