తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా జరిగిన గరుడసేవ సమిష్టి కృషితో విజయవంతమైంది. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సందర్బంగా సక్సెస్ చేసినందుకు విశిష్ట సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గరుడసేవ అనంతరం అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. భారీ వర్షం కురుస్తున్నా భక్తులు అచంచలమైన భక్తిశ్రద్ధలతో స్వామివారి గరుడసేవను వీక్షించేందుకు వేచి ఉన్నారని అన్నారు. వారికి సంపూర్ణ దర్శనం కల్పించామని ఈవో తెలిపారు. వర్షంలోనూ భక్తులకు అన్న ప్రసాదాలు, తాగునీరు, బాదంపాలు, సుండలు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు అందించినట్లు చెప్పారు.
భక్తుల సేవే భగవంతుని సేవ” అనే స్ఫూర్తితో సేవలు అందించిన టీటీడీ పాలక మండలి, మరింత బాధ్యతగా విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బంది, విజిలెన్స్, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, శ్రీవారి సేవకులు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో వర్షాల సమయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు శాశ్వత పరిష్కార మార్గాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యుత్ అలంకరణల ఏర్పాట్లపై ఎలక్ట్రికల్ శాఖ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా ఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవోలు డా. ఎ. శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో కేవీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.



















